నిన్న రాత్రి మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా సిబ్బంది

  • గోల్నాక, భాగ్యనగర్ ప్రాంతంలో మూసీలో పడిన మహిళ
  • ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత మహిళను గుర్తించిన స్థానికులు
  • సమాచారం అందగానే 16 నిమిషాల్లో రంగంలోకి దిగిన హైడ్రా
హైదరాబాద్‌లోని అంబర్‌పేట, గోల్నాక సమీపంలో మూసీలో పడిన ఓ మహిళను హైడ్రా కాపాడింది. మహిళను తమ సిబ్బంది కాపాడినట్లు హైడ్రా 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది. ఈరోజు ఉదయం 10.51 గంటలకు హైడ్రా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చిందని, పదహారు నిమిషాల్లోనే అంటే, 11:07 గంటలకు హైడ్రా బృందాలు అక్కడకు చేరుకున్నట్లు తెలిపింది.

అంబర్‌పేట్ సమీపంలోని గోల్నాక, భాగ్యనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇందిర (49) శుక్రవారం రాత్రి మూసీలో పడిపోయింది. ఆ సమీపంలో ఒడ్డుకు చేరే అవకాశంలేని చోట, చెట్లు అడ్డం ఉన్నచోట మూసీలోకి ఆమె జారి పడింది. రాత్రంతా ఆమె మూసీలోనే భయం భయంగా గడిపింది. కేకలు వేసినా ఎవరికీ వినపడలేదు. శనివారం ఉదయం 10 గంటల తర్వాత స్థానికులు గుర్తించారు.

బయటకు తీయడానికి అవకాశం లేకపోవడంతో హైడ్రా కంట్రోల్ రూమ్ 90001 13667 నెంబర్‌కు ఫోన్ చేసి స్థానికులు సమాచారం ఇచ్చారు. స్వామి (డీఆర్ఎఫ్ రెస్క్యూ ఇన్‌ఛార్జ్) టీమ్ 16 అంబర్‌పేట్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. హైడ్రా సహాయక చర్యలు జరుగుతుండగానే ఫైర్ సిబ్బంది కూడా అక్కడకు చేరుకున్నారు.

పెద్ద నిచ్చెన సహాయంతో డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు కిందకు దిగి మూసీలో ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న మహిళను కాపాడారు. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులకు అప్పగించారు. పొరపాటున జారి పడిపోయినట్టు ఆమె చెప్పారు. తనకు భర్త లేడని, ఇద్దరు పిల్లలతో సమీపంలోనే ఉంటున్నట్లు ఆమె చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను హైడ్రా సిబ్బంది రక్షించిన తీరును స్థానికులు అభినందించారు.

Hydra
Hyderabad Hydra
Moosi River
Amberpet
Golnaka
Indira
DRF Rescue
Telangana News

More Telugu News